చిత్తూరు: టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గురువారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.టీడీపీకి కూడ ఆమె రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.

తన ప్రమేయం లేకుండా పార్టీలో నియామాకాలు చోటు చేసుకోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడికి ఆమె రాజీనామా లేఖను పంపారు.  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే మనోవేదనకు గురైనట్టుగా ఆమె అనుచరులు చెబుతున్నారు.

గల్లా అరుణకుమారి కుటుంబం బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరీతో గల్లా అరుణకుమారి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నట్టుగా చెబుతారు.దీంతో గల్లా కుటుంబం బీజేపీలో చేరుతారా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ సంస్థాగత కమిటీలను పునర్వవ్యవస్థీకరిస్తున్న సమయంలో గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేయడం కలకలం చేలరేగింది.

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ గుంటూరు నుండి రెండో దఫా ఎంపీ గా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గుంటూరు ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఆయన విజయం సాధించారు.