అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బాబూరావు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన గతంలో రెండు సార్లు టీడీపికి రాజీనామా చేశారు. తిరిగి టీడీపిలోకి వచ్చారు. 

టీడీపీకి రాజీనామా చేసి ఆయన గతంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మళ్లీ 2014లో టీడీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆసమయంలో ఆయన చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై ఓటమి పాలయ్యారు.

2014 నుంచి తనను పార్టీ పట్టించుకోవడం లేదని, అందుకే టీడీపీకి రాజీనామా చేశానని గద్దె బాబూరావు చెప్పారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని బాబూరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని, చాలా కష్టపడి ఈ స్తాయికి వచ్చానని ఆయన చెప్పారు. 1978లో తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసులో ఉంటూ వచ్చిన తను ఎన్టీఆర్ పార్టీని పెట్టిన తర్వాత టీడీపీలో చేరానని చెప్పారు. ఆప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచానని ఆయన చెప్పారు 

చీపురుపల్లి ప్రజల సహకారం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశానని ఆయన చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యేల బీ ఫారాలు తనకే ఇచ్చేవారని ఆయన చెప్పారు. కానీ అప్పటి టీడీపీకి, ఇప్పటి టీడీపీకి మధ్య ఏ మాత్రం పొంతనలేదని ఆయన విమర్సించారు 

2004 నుంచి గద్దెబాబూరావు పార్టీలో ఉన్నాడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరి మీద కూడా విమర్శలు చేయడం ఇష్టం లేనది చెప్పారు. ఆత్మగౌరవం, ఆత్మసంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఈ రోజు తాను టీడీపికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తనకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీలో నేడు గుర్తించేవారు లేకపోవడం తనను బాధ కలిగించిందని, తనకు ఎంతో మంది నచ్చజెప్పారని, కానీ తన నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదని ఆయన చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యున్నతికి తాను ఎంతో కృషి చేశానని బాబూరావు చెప్పారు. 

ఎటువంటి మద్దతు లేకపోయినా రెండు సార్లు ఎమ్ెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా పనిచేశానని ఆయన చెప్పారు. చీపురుపల్ిలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఆయన చెప్పారు. చీపురుపల్లి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందరి అభిప్రాయాలు తీసుుకని ఏ పార్టీలో చేరాలనే విషయం నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంచన చేరుతున్నారు.