కాకినాడ జిల్లా వెలమకొత్తూరులో విషాదం: నాటు తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల బాలిక మృతి
కాకినాడ జిల్లాలోని తుని మండలం వెలమకొత్తూరులో నాటు తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ: కాకినాడ జిల్లాలో మంగళవారం నాడు విషాదం చోటు చేసుకుంది. తుని మండలం వెలమకొత్తూరులో నాటు తుపాకీ తూటా తగిలి నాలుగేళ్ల బాలిక ధన్యశ్రీ మృతి చెందింది. పెంపుడు పందులను చంపేందుకు నాటు తుపాకీతో కాల్పులు జరిపిన సమయంలో ప్రమాదవశాత్తు తూటా నాలుగేళ్ల బాలిక ధన్యశ్రీకి తగిలింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ధన్యశ్రీ మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవాళ ఉదయం గ్రామంలో పెంపుడు పందులను చంపేందుకు గ్రామస్తులు నాటు తుపాకీని ఉపయోగించారు. అదే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చి తోటి పిల్లలతో ధన్యశ్రీ ఆడుకుంటుంది. పందులను కాల్చిన తూటా ప్రమాదవశాత్తు ధన్యశ్రీకి తగిలింది. దీంతో ధన్యశ్రీ ఆడుకుంటున్న చోటే కుప్పకూలిపోయింది. తోటి పిల్లలు ఈ విషయాన్ని పేరేంట్స్ కు చెప్పారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆ చిన్నారి మృతి చెందింది. నాటు తుపాకులు ఉపయోగించే సమయంలో అటవీ శాఖ అధికారులుండాలి. ఫారెస్ట్ అధికారుల సమక్షంలోనే ఈ తుపాకులు ఉపయోగించాలి. ఈ తుపాకులు ఉపయోగించే వారికి షూటింగ్ లో నైపుణ్యం ఉండాలి. అయితే నిబంధనలకు విరుద్దంగా నాటు తుపాకీ ఉపయోగించడం వల్ల ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.