పల్నాడులో ట్రావెల్స్ బస్సు, కలప లారీ ఢీ... ఎంత ఘోరమో చూడండి...
ప్రయాణికులతో కూడిన ట్రావెల్స్ బస్సు హైవేపై వేగంగా దూసుకెళుతూ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహ నలుగురు గాయపడ్డారు.

చిలకలూరిపేట : ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు, కలప లోడ్ తో లారీ జాతీయ రహదారిపై వేగంగా వెళుతుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనకాల బస్సు ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ దుర్ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నెల్లూరు నుండి రాజమండ్రికి కడపలోడ్ తో ఓ లారీ బయలుదేరింది. ఈ క్రమంలోనే ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సు విజయవాడకు వెళుతోంది. ఈ రెండు వాహనాలు జాతీయ రహదారి 16 పై వేగంగా వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాయి.
పల్నాడు జిల్లా యడ్లపాడు ఎర్రకోండ సమీపాన గల బ్రిడ్జి వద్దకు చేరుకోగానే లారీ కొద్దిగా స్లో అయ్యింది. దీంతో వెనకాల వేగంగా దూసుకొస్తున్న బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మిగతా ప్రయాణికులు మాత్రం ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.
Read More ఆర్మీ జవాన్ పై అమానుషంగా దాడిచేసిన పోలీసులు... డిజిపి సీరియస్ యాక్షన్
ప్రమాదంపై సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా 108 కు ఫోన్ చేయగా అంబులెన్స్ చేరుకుని క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారందరికీ స్వల్ప గాయాలే అయినట్లు... ప్రాణాలకేమీ ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రమాదంనుండి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు. బస్సు ముందుభాగం ధ్వంసమై హైవేపై ఆగిపోయిన బస్సును పక్కకు జరిపించి ఆగిన ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. ఈ ప్రమాదం ఇవాళ ఉదయం 6-7 గంటల సమయంలో జరిగింది... ఈ సమయంలో హైవేపై వాహనాల రద్దీ ఎక్కువ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.