ఆర్మీ జవాన్ పై అమానుషంగా దాడిచేసిన పోలీసులు... డిజిపి సీరియస్ యాక్షన్
భారత ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. దిశ యాప్ విషయంలో చోటుచేసుుకున్న వివాదం సైనికుడిపై దాడికి దారితీసింది.
అనకాపల్లి : భారత ఆర్మీ ఉద్యోగిపై దాడిచేసిన పోలీసులపై ఆంధ్ర ప్రదేశ్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి సీరియస్ అయ్యారు.సైనికుడితో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తూ దాడికి పాల్పడిన వీడియో డిజిపి వరకు వెళ్లింది. దీంతో దాడికి పాల్పడిన నలుగురు కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు డిజిపి ఆదేశించారు.
ఆర్మి జవాన్ పై దాడి రాజకీయంగా మారుతుండటంతో డిజిపి వెంటనే స్పందించారు. ఇది పోలీసుల తప్పేనని నిర్దారణకు వచ్చిన ఆయన తక్షణమే చర్య తీసుకున్నారు. అందరిముందే రోడ్డుపై జవాన్ ను లాక్కువెళుతూ దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేయాల్సిందిగా అనకాపల్లి ఎస్పీ, ఆ రేంజ్ డిఐజిని ఆదేశించినట్లు డిజిపి కార్యాలయం ప్రకటించింది.
అసలేం జరిగింది :
గత మంగళవారం అనకాపల్లి జిల్లా పరవాడ పోలీసులు స్థానికంగా వున్న ఓ మార్కెట్ లో మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యాప్ ఎవరి ఫోన్లలో అయితే లేవో వారితో డౌన్ లోడ్ చేయించసాగారు. ఇలా ఆర్మీ ఉద్యోగి సయ్యద్ అలీముల్లాను కూడా దిశయాప్ డౌన్లోడ్ చేసేకోవాల్సిందిగా పోలీసులు కోరారు. అందుకు అంగీకరించిన అతడు యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ తనకు చెప్పాల్సిందిగా మహిళా కానిస్టేబుల్ కోరింది. ఇందుకు అతడు నిరాకరించడంతో వివాదం రేగింది.
అయినా ఎక్కడో జమ్మూ కాశ్మీర్ లోని దేశ బార్డర్ లో పనిచేసే తనకు దిశ యాప్ ఎందుకు... అవసరం లేదని సయ్యద్ పోలీసులకు తేల్చిచెప్పాడు. అయినా వినిపించుకోకుండా ఫోన్ కు వచ్చిన ఓటిపి చెప్పాలని కానిస్టేబుల్స్ ఒత్తిడి చేసారు. ఈ క్రమంలో వారిపై అనుమానం రావడంతో ఐడీ కార్డులు చూపించాలని సయ్యద్ కోరాడు. దీంతో ఆగ్రహించిన మహిళా కానిస్టేబుల్ అతడిపై చేయిచేసుకుంది. మిగతా కానిస్టేబుల్స్ కూడా సైనికుడిపై దాడిచేసి చాలా అవమానకరంగా వ్యవహరించారు. సయ్యద్ అలీముల్లాను బలవంతంగా ఓ ఆటో ఎక్కించే ప్రయత్నం చేసారు.
Read More మహిళల ఫోన్లలోనే కాదట... దిశ యాప్ పేరుతో ఏదో జరుగుతోంది..: నారా లోకేష్ అనుమానం (వీడియో)
అయితే సైనికుడిపై పోలీసుల దాడి దృశ్యాలను అక్కడున్నవారు వీడియో తీసారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిజిపి ఆదేశించారు.
ఇలా ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి వీడియోను నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన సయ్యద్ ను ఫోన్ లో దిశ యాప్ వేసుకోవాలని పోలీసులు ఒత్తిడిచేసారని... దీనిపై అతడు అనుమానం వ్యక్తంచేయగా పోలీసులే గూండాల్లా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారని తెలిపారు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన ఈ దిశ యాప్ ను పురుషుల ఫోన్లలో బలవంతంగా ఎక్కించడం చూస్తుంటే దీని పేరుతో ఏదో దందా నడుస్తోందని అనుమానం కలుగుతోందని లోకేష్ అన్నారు.
సయ్యద్ అలీముల్లాపై పోలీసులే గూండాల్లా దాడి చేయడం దారుణమని లోకేష్ అన్నారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు స్వరాష్ట్రమైన ఏపీకి వస్తే ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఈ జగన్ రెడ్డి పాలనలో వచ్చిందన్నారు లోకేష్.