కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశమంతా మే 3వరకు లాక్ డౌన్ విధించారు. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఏపీలో మాత్రం కొద్దిగా సడలిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. ఈ లాక్ డౌన్ మద్యం ప్రియులు పడుతున్న తిప్పలు అంతా ఇంతా కాదు. చుక్క మద్యం కోసం చాలా మంది పరితపించిపోతున్నారు.  కొందరైతే మందు దొరకలేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయితే.. వీరి అవసరాలను గమనించిన కొందరు ఎక్కువ రేటుకి మద్యాన్ని రహస్యంగా అమ్ముతున్నారు.

కాగా.. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా శానిటైజర్ తో మద్యం తయారు చేసి అమ్మాలని చూసాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం డిమాండ్ ను పసిగట్టిన ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ మరో ముగ్గురితో కలిసి శానిటైజర్ తో నాటు సారా తయారీ చేపట్టాడు. దానిని విక్రయిస్తూ మంగళవారం అబ్కారీ శాఖ అధికారులకు చిక్కారు.

అనంతరం అబ్కారీ శాఖ కార్యాలయంలో ఉప కమిషనర్ వియశేఖర్ విలేకరుల సమావేశంలో ఈ ఘటన వివరాలను వెల్లడించారు. కమలానగర్ లోని రఘువీరా కాంప్లెక్స్ ప్రాంతంలో నలుగురు కల్తీ సారా విక్రయిస్తున్నారని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో ఓ పోలీస్ అధికారిని మారువేషంలో సారా కొనుగోలు చేసే వ్యక్తిగా పంపించారు. అనంతరం వారి బండారం బట్టబయలు  చేసి.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.