ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Four killed in road accident in Prakasam district in Andhra Pradesh
Highlights

రాజధాని అమరావతికి వెళుతుండగా ఘటన

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్లంపల్లి సమీపంలో దువ్వలేరు వాగు వద్ద కారు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విజయలక్ష్మి కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. ఆమె ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్యాపకురాలిగా ఎంపికయ్యంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన తుది పోస్టింగ్ ల జాబితాలో ఈమె పేరు లేదు.  కర్నూల్ గుత్తికి చెందిన గిడిగె కృష్ణవేణి ది కూడా ఇదే సమస్య. ఈ విషయం గురించి కనుక్కునేందుకు రాజధాని అమరావతికి వెళ్లాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కృష్ణవేణి, ఆమె భర్త, విజయలక్ష్మిలు ఇవాళ  కారులో అమరావతికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రకాశం జిల్లా వెల్లంపల్లి సమీపంలోని దువ్వలేరు వాగు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.  కారు నుజ్జునుజ్జయిపోయి మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బైటికి తీశారు. అనంతరం పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
 
 

loader