వైద్యం కోసం వెళుతుండగా కారు ప్రమాదానికి గురయి తల్లీ కొడుకుతో సహా నలుగురు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
కడప : శనివారం అర్ధరాత్రి ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం నలుగురు దుర్మరణం పాలయ్యారు. పక్షపాతంతో బాధపడుతున్న తల్లికి వైద్యం కోసం తీసుకెళుతుండగా ఆ ఘోరం జరిగింది. దీంతో తల్లీకొడుకులతో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయి మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పెనమాల లక్ష్మమ్మ(65) పక్షవాతం బారిన పడింది. అసలే వృద్దాప్యంతో ఇబ్బందిపడుతున్న ఆమెను పక్షవాతం మరింత బాధించింది. కన్న తల్లి ఇలా బాధపడటం చూడలేకపోయిన కొడుకు నర్సయ్య(41) వైద్యం చేయించాలని నిర్ణయించాడు. ఇందుకోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి తీసుకువెళుతుండగా ఘోరం జరిగింది.
తల్లి లక్ష్మమ్మ,బంధువు చిన్నక్క, బాలుడు హర్షవర్దన్ తో కలిసి నర్సయ్య కారులో బయలుదేరాడు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు రామాపురం మండలం నల్లగుట్టపల్లి సమీపంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. దీంతో పేషెంట్ లక్ష్మమ్మతో పాటు కొడుకు నర్సయ్య, డ్రైవర్ రాజారెడ్డి(35) అక్కడికక్కడే మృతిచెందారు. చికిత్స పొందుతూ చిన్నక్క కూడా మృతిచెందారు.
Read More బస్సు నడుపుతుండగా డ్రైవర్ కి తీవ్ర అస్వస్థత.. స్పృహ తప్పుతుండగా అతను చేసిన పనికి...
ప్రమాదం జరిగిన వెంటనే కారులోంచి బాలుడు హర్షవర్దన్ ను బయటకు తీసి కడప రిమ్స్ కు తరలించారు. అలాగే మరో కారులోని ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని కూడా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే రాయచోటి డిఎస్పీ శ్రీధర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
