ఓ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల పెనుప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బస్సును పక్కకు నిలిచి స్పహకోల్పోయాడు. 

అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ బస్సు శనివారం ఉదయం కర్నూలు నుంచి రాయదుర్గం వెడుతోంది. కళ్యాణదుర్గం సమీపానికి వచ్చేసరికి డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి కళ్ళు తిరుగుతూ స్పృహ తప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. 

కానీ ఆ సమయంలో కూడా బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించాడు. బస్సును రోడ్డు పక్కకు ఆపి.. ఆ వెంటనే స్టీరింగ్ మీద స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన బస్సులోని కండక్టర్ మిగతా ప్రయాణికులు వెంటనే ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఆపారు. డ్రైవర్ను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ డ్రైవర్కి చికిత్స అందిస్తున్నారు. 

కాగా, స్పృహ తప్పుతున్న సమయంలో కూడా డ్రైవర్ చేసిన చిన్న పని పెను ప్రమాదాన్ని తప్పించిందని అందరూ అభినందనలు కురిపిస్తున్నారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదం బారిన పడకుండా కాపాడాడని, అతను త్వరగా కోలుకోవాలని ప్రయాణికులంతా కోరుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా, గుజరాత్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ డ్రైవర్ నిబద్దతకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. గుండెను నొప్పి మెలిపెడుతున్నా ప్రయాణికుల ప్రాణాలు కళ్ళ ముందు కనిపించాయి. ఆ నొప్పిని లెక్కచేయకుండా ప్రయాణికులు అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి.. ఆ తర్వాత కన్నుమూశాడు ఓ బస్సు డ్రైవర్. ఈ హృదయ విదారకమైన ఘటన సోమవారం గుజరాత్ లోని రాధన్ పూర్ లో చోటుచేసుకుంది.

హృదయవిదారకం.. మామిడికాయల లారీ బోల్తాపడి.. మూడేళ్ల చిన్నారి మృతి...

ఈ ఘటనకు సంబంధించి ఆ బస్సులో ఉన్న కండక్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న భర్మల్ అహీర్ (40) గుజరాత్ లోని రాధన్ పూర్ లో డ్యూటీ చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా బస్సు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. బస్సు మార్గమధ్యంలో ఉండగా చాతిలో నొప్పి రావడం మొదలయ్యింది. అయితే, బస్సును ఎక్కడ ఆపడానికి వీలు లేకపోవడంతో చాతి నొప్పిని భరిస్తూనే 15 కిలోమీటర్ల వరకు బస్సును నడిపాడు. బస్సును డిపోకు చేర్చిన తర్వాత గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

అది గమనించిన సిబ్బంది వెంటనే అహిర్ ను రాధన్ పూర్ సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. ఆదివారం రాత్రి 8:30 గంటలకు అహిర్ బస్సు డ్రైవింగ్ చేస్తూ సోమనాథ్ బయలుదేరాడు. సోమవారం ఉదయం 7.05గంటలకు రాధన్ చేరుకోవాల్సి ఉంది. ఉదయం టీ బ్రేక్ కోసం వారాహి వద్దా కొద్దిసేపు బస్సును ఆపారు.

అదే సమయంలో బస్సులోని కండక్టర్ తో ఆహీర్ తనకు ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు తెలిపాడు. బస్సులోని ప్రయాణికులను హైవే మీద ఒంటరిగా వదిలేయడానికి అతడికి మనసుపలేదు. దీంతో చాతినొప్పితోనే బస్సును అలాగే 20 నిమిషాల పాటు నడిపి డిపోకు చేర్చాడు. ఆ తర్వాత అతడు మృతి చెందాడని.. బస్సులోని కండక్టర్ చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.