ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్ర మృతిచెందారు. మద్యానికి బానిసైన రవీంద్రను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన ఆసుపత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తలదాచుకున్నారు. ఈ క్రమంలో రక్తపు వాంతులతో అదే హోటల్‌లోనే రవీంద్ర కన్నుమూశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయన కొద్ది రోజుల పాటు ఏలూరు ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు.

Also Read:మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మృతి

రాంజీ టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేవారు పార్టీ వ్యవహారాల్లో మాగంటి బాబుకు సహాయసహకారాలు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు చిన్న కుమారుడు రవీంద్ర కూడా మరణించడంతో మాగంటి బాబు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.