అమరావతి: పేదలకు ఇళ్లస్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం అంతులేని అవినీతికి తెరలేపిందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇళ్లస్థలాల కొనుగోలులో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇళ్లస్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం అంతులేని అవినీతికి తెరలేపిందన్నారు.  పేరేమో పేదలది... లబ్ది పొందేదేమో  వైసీపీ నేతలు, కార్యకర్తలన్నట్లుగా ఇళ్లపట్టాల పంపిణీ వ్యవహారం సాగుతోందన్నారు. 

ఇళ్లస్థలాల కొనుగోలులో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన చెప్పారు.  ఆడలేక మద్దెల ఓడన్నట్లు పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడం చేతగాని అసమర్థులు  తమపై నిందలు వేస్తున్నారని ఆయన విమర్శించారు.

రాజధానికోసం తమ భూములను త్యాగంచేస్తే  పేదలపేరుతో వాటిని కొట్టేయడానికి సిద్ధమైన వైసీపీ రాబందులను ఎదుర్కోవడానికి అమరావతిలోని రైతులు కొందరు కోర్టులకు వెళ్లారని ఆయన చెప్పారు.  

తాము రాజధానికి భూములిస్తే ఒప్పందం ప్రకారం వాటిని అభివృద్ధిచేసి తమకు అప్పగించకుండా పేదలపేరుచెప్పి కొట్టేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై రైతులు కోర్టుని ఆశ్రయిస్తే  వారికి న్యాయంచేయడం ఈ ప్రభుత్వానికి చేతగాలేదని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాముపేదలకు ఇళ్లస్థలాలిస్తుంటే ఓర్వలేని టీడీపీ కోర్టుకెళ్లిందంటూ వైసీపీనేతలు దుర్మార్గంగా విషప్రచారం చేస్తున్నారన్నారు. అమరావతిలోని భూములపై కాకుండా రాష్ట్రంలోని ఏ భూములకు సంబంధించి టీడీపీ  కోర్టుకెళ్లిందిలేదన్నారు. అలా ఎక్కడ ఎవరు కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారో దమ్ము ధైర్యముంటే, వైసీపీ ప్రభుత్వం బయటపెట్టాలని బొండా డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ప్రైవేట్ వ్యక్తులనుంచి సేకరించిన 14వేల ఎకరాలభూమి వైసీపీనేతలు, బంధువులు వారి బినామీలు కార్యకర్తలదేనన్నారు. ఎకరం రూ.5లక్షల నుండి.15లక్షలకు కొని  రూ.70 నుండి  రూ.80లక్షలకు కొన్నట్లు తప్పుడు ఆధారాలుచూపి ప్రజలసొమ్ముని దిగమింగారన్నారు.

ఇలా  రూ.3వేలకోట్లకు పైగా ప్రజల సొమ్మును ఇళ్లస్థలాల పేరుతో వైసీపీ నేతలు అడ్డగోలుగా తినేశారన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు పాల్పడిన  దోపిడీకి సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు. 

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ  లిక్కర్ (మద్యం) ఇసుక, మైన్స్ మాఫియాలతో తిన్నది చాలక ఇప్పుడు ఇళ్లస్థలాల పేరుతో వైసీపీనేతలు సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారన్నారు. 

 వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలకు సంబంధించి కేంద్రానికి రాసినలేఖలపై ఏం సమాధానం చెబుతారని బొండా నిలదీశారు. వైసీపీ జిల్లానేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లందరూ భూమాఫియాలో మునిగితేలుతున్నా, జగన్ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా వ్యవహరిస్తోం దన్నారు.

 పేదలకు స్థలాలివ్వకుండానే వారినుంచి అందినకాడికి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని,  కొన్నిచోట్ల పేదలకు కొండలు, గుట్టలు, పాఠశాలల స్థలాలు, పోరంబోకు భూములిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.

 చట్టబద్ధంగా ఆమోదయోగ్యంకాని నివాసానికి పనికిరాని భూములను పేదలకు ఇవ్వాలనే నెపంతో కాజేశారన్నారు. తూర్పుగోదావరిలో ముంపునకు గురయ్యే ఆవ భూములు, ప్రకాశంలో 1300ఎకరాల మైనింగ్ భూమిని, కర్నూల్లో 1500ఎకరాల నివాసయోగ్యం కాని భూమిని, కొండ, చెరువుభూములను పేదలకు ఇచ్చారన్నారు.  

టీడీపీ చెబుతున్న అంశాలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని, చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై ఎందుకుస్పందించలేదని బొండా ప్రశ్నించారు. 

 తమపార్టీ నేతల అవినీతి,  అక్రమాలు బయట పడతాయన్న భయంతోనే జగన్ ప్రభుత్వం విచారణకు వెనుకాడుతోందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక కుంభకోణాల్లో మునిగిపోయిందని, ఇందులో భూ కుంభకోణమే అతిపెద్దదన్నారు. 

ఇళ్లస్థలాలకు సంబంధించి కొనుగోలు చేసినభూముల్లో ఏ తప్పు జరగనప్పుడు విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు సంశయిస్తోందన్నారు.  భూ కుంభకోణంపై సీబీఐతో  విచారణ జరిపిస్తేనే అసలు దొంగలెవరో వారిని రక్షిస్తున్నవారెవరో బయట పడుతుందని బొండా డిమాండ్ చేశారు. 

సీబీఐ విచారణతోనే ఎంతభూమి కొన్నారు, ప్రభుత్వ సొమ్ము ఎవరి ఖాతాల్లో నుంచి ఎవరికి వెళ్లింది, అంతిమంగా లబ్ది పొందినవారెవరు అనేది బయటపడుతుందన్నారు.  ప్రభుత్వం భూకుంభకోణంపై విచారణ జరపకుంటే, తెలుగుదేశమే జరిగిన దోపిడీని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళుతుందని ఉమామహేశ్వరరావు తేల్చిచెప్పారు. ప్రజలసొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులే, దోపిడీకి పాల్పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.