ఏపీలో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కొందరు గైర్హాజరయ్యారు. తమకు మళ్లీ మంత్రి పదవి దక్కలేదన్న బాధతో వారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
అమరావతి : ఏపీలో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రులు సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గౌర్హాజరయ్యారు. మాజీ హోంమంత్రి సుచరిత ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మోపిదేవి వెంకటరమణకు అందజేశారు. మరోవైపు తనకు మంత్రి పదవి నిరాకరించడంపై అధిష్టానంపై మాజీ మంత్రి బాలినేని మండిపడుతున్నారు. ఇప్పటికే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేకమార్లు బుజ్జగించి నప్పటికీ మెత్తబడిన ఇరువురు నేతలు.. నేడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ పక్కన ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం వేదికపై సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూర్చున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదివారు. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత వరుసగా అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కె నారాయణ స్వామి, కేవి ఉషశ్రీ చరణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రుల కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి పదవులు దక్కపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మంత్రివర్గంలో మరోసారి చోటు దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో నిరసనగా రాజీనామా చేయాలని భావిస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇక సోమవారం తన నివాసంలోనే ప్రకాశం జిల్లా ముఖ్య నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నేతలతో బాలినేని మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ రెడ్డి కూడా బాలినేనిని కలిశారు. తనకు తిరిగి మంత్రివర్గంలో చోటుదక్కక పోవడంతో వారు నిరాశ చెందారు. తమ జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను తిరిగి కేబినెట్లో చోటు కల్పించి.. తనను తొలగించడంతో ఆయన మరింత అసంతృప్తికి గురయ్యారు. కేబినెట్లో బెర్త్ దొరకకపోవడంతో ఆయన సొంత నియోజకవర్గంలో అనుచరులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆయనను బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం రెండుసార్లు ఆయన నివాసానికి వచ్చారు. మొదట మధ్యాహ్నం ఆయన ఇంటికి వచ్చిన సజ్జల చర్చలు జరిపారు. మంత్రివర్గ జాబితా విడుదల తర్వాత రాత్రి మరోసారి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే రాత్రి బాలినేనితో చర్చించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కొనసాగించి తను ఒక్క దాన్ని తొలగించడం ఏమిటని ఆమె ఇప్పటికే తన అసంతృప్తిని బయటపెట్టారు. ఆమెను బుజ్జగించడానికి వచ్చిన మోపిదేవికి తన రాజీనామాను సమర్పించారు. సభ్యత్వానికి కాకుండా తన ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేసినట్టు ఆమె కూతురు దిశగా మీడియాకు వెల్లడించారు. ఆమె అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకొని నిరసన తెలపడం కాకుండా మోపిదేవి కాన్వాయ్ కి అడ్డంగా పడుకున్నారు. చివరకు పోలీసుల సహాయంతో ఆయన అక్కడి నుంచి వెళ్లారు.
