అమరావతి:చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ సొదాల విషయంలో వైసీపీ చేసిన తప్పుడు ప్రచారంపై న్యాయ పరమైన చర్యలు తీసుకొంటామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారుల పంచనామా వివరాలు మీడియాలో వచ్చాయి. ఈ విషయమై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. టీడీపీపై తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలతో పాటు సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన ప్రకటించారు.

ప్రెస్ కౌన్సిల్‌కు, ఎడిటర్స్ గిల్డ్‌కు కూడ ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో  రూ. 2 వేల కోట్లు దొరికినట్టుగా తప్పుడు ప్రచారం చేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఐదు రోజుల పాటు ఐటీ దాడులను బూతద్దంలో చూడకూడదన్నారు. రూ 2లక్షల నగదుకు, రూ 2వేల కోట్లని ప్రచారం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 

వైసీపీ అబద్దాలకు ఐటీ దాడులపై చేసిన తప్పుడు ప్రచారమే కారణమని యనమల రామకృష్ణుడు  విమర్శించారు. ఐటీ శాఖ రిపోర్టుపై వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. పంచనామా కాగితాలను చూసైనా వైసీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలని ఆయన సూచించారు. 

తమపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొంటామని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నవాళ్లు ఇప్పుడేం జవాబిస్తారని ఆయన ప్రశ్నించారు.అరెస్ట్ చేయాలన్న నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయని  ఆయన ప్రశ్నించారు. 

రోజుకు 20మంది చొప్పున లేచిన నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయన్నారు. ఐటీ దాడులపై వైసిపి నేతల విమర్శలన్నీ అబద్దాలేనని తేలిందన్నారు.
అబద్దాలతో వైసిపి నేతలు అధికారంలోకి వచ్చారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.