అమరావతి:  కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎందుకో భయపడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.గురువారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల రామకృష్ణుడు పలు ప్రశ్నలు సంధించారు.

 ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనతో కనీసం విమాన ఖర్చులను కూడ కేంద్రం నుండి రాబట్టుకోలేకపోయారని యనమల విమర్శించారు. ప్రధానమంత్రి మోడీతో ఎన్ని నిమిషాలు మాట్లాడారనేది ముఖ్యం కాదు రాష్ట్రానికి ఏం తెచ్చారనేదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 

Also read:ప్రధాని మోదీతో జగన్ భేటీ... ఆ రహస్య ఒప్పందాల కోసమేనా...: వర్ల రామయ్య

రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారా లేక తన కేసుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఏపీ సీఎం తీసుకొంటున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు కూడ తీవ్రమైన ఇబ్బందులు  ఎదుర్కొనే పరిస్థితులు  నెలకొన్నాయన్నారు. 

 ఏ రాష్ట్రంలో మంచి ప్రోత్సాహకాలు, శాంతిభద్రతలు సక్రమంగా ఉంటాయో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతారని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ఆయన వైసీపీని ప్రశ్నించారు.

జగన్  ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లి కూడ రాష్ట్రానికి ఏం సాధించారని యనమల ప్రశ్నించారు. మోడీకి ఇచ్చిన వినతిపత్రాన్ని ఎందుకు బహిరంగపర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. 

 వైసీపీ నాయకులు స్వార్థం తో మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. విశాఖలో భూ కబ్జాలు భారీగా పెరిగిపోయయన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వైసీపీ నేతలు విశాఖలో ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

రాజధాని కావాలని విశాఖ ప్రజలు కోరుకోలేదని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. శాసనమండలిని రద్దు చేయాలని ప్రధానమంత్రి మోడీకి జగన్ చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. శాసనమండలిని ఎందుకు రద్దు చేయాలలో చెప్పాలని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను తాము సెలెక్ట్ కమిటీకి పంపినట్టుగా చెప్పారు. ఈ బిల్లులను తాము అడ్డుకోవడం లేదన్నారు ఈ విషయాన్ని జగన్ తెలుసుకోవాలని  మాజీ మంత్రి హితవు పలికారు. శాసనమండలిలో ఉన్నత విద్యావంతులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇష్టమొచ్చినట్టుగా చేస్తే చూస్తూ ఊరుకోబోమని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.