అమరావతి: ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న రమేష్ కుమార్ ను తొలగించడంపై ఆయన మండిపడ్డారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీ రమేష్‌కుమార్ ను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినందుకు రమేష్ కుమార్ ను  తొలగించారని ఆయన ఆరోపించారు.

Also read:బీజేపీ నుండి ఆహ్వానం ఉంది: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎసీఈసీ పోస్టుకు 65 ఏళ్ల వయస్సు నిబంధన ఉన్న విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే 80 ఏళ్ల కనగరాజ్ కు ఎస్ఈసీ పదవిని ఎలా కట్టబెడుతారని ఆయన ప్రశ్నించారు.

డాక్టర్లు ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తోంటే సస్పెండ్ చేస్తున్నారని  సోమిరెడ్డి ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నా కూడ  వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు ఏపీకి వస్తానంటే క్వారంటైన్ చేస్తామన్న ప్రభుత్వం కనగరాజ్ కు ఎందుకు ఈ నిబంధనను వర్తింపజేయలేదో చెప్పాలని ఆయన కోరారు.