Asianet News TeluguAsianet News Telugu

దళితుడితో కాళ్లు పట్టించుకున్న పల్లె

  • అధికారంలో తామే ఉన్నాము కనుక.. తమను ఎవరూ ఎదిరించలేరు అనే భావనలో వారు మునిగి తేలుతున్న టీడీపీ నేతలు
  • దళితులను బెరించి మరీ కాళ్లు పట్టించుకున్న ఎమ్మెల్యే పల్లె
former minister palle forces dalits to apologize for raising embarrassing questions

టీడీపీ నేతలు అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో తామే ఉన్నాము కనుక.. తమను ఎవరూ ఎదిరించలేరు అనే భావనలో వారు మునిగి తేలుతున్నారు. అందుకు నిదర్శనమే అమడగూరులో జరిగిన సంఘటన. నమ్మి ఓటేసిన  వారికి సేవ చేయాల్సింది పోయి.. తిరిగి వారి చేత కాళ్లు పట్టించుకున్నాడు ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి.

వివరాల్లోకి వెళితే..  ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా అమడగూరు మండలంలోని మహమ్మదాబాద్‌ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి పర్యటించారు. ఎస్సీ కాలనీలో ఆయన ప్రచారం చేస్తుండగా..కాలనీలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నీటి సమస్యను కూడా పరిష్కరరించలేకపోతే ప్రజాప్రతినిధులెందుకు అని స్థానికులు నిలదీశారు.

 

దీంతో ఎమ్మెల్యే  ఆ కాలనీ వాసులతో మారెమ్మ గుడి వద్ద సమావేశమయ్యారు. అనంతరం  పల్లె మాట్లాడుతూ మీ కాలనీకి సీసీ రోడ్లు వేశామని. పింఛన్లు ఇస్తున్నామని, ఇళ్లు మంజూరు చేశామని అయినా మీరు ఇలా ప్రశ్నించడం బాలేదన్నారు. వెంటనే ఆ సమావేశంలో ఉన్న ఆదినారాయణ అనే యువకుడు ..కాలనీకి ఇచ్చిన 5 ఇళ్లు టీడీపీ కార్యకర్తలకే తీసేసుకున్నారు అని అన్నాడు.  యువకుడి వ్యాఖ్యలతో పల్లె కోపంతో ఊగిపోయాడు. ‘పెద్ద చదువులు చదువుకున్నావ్‌ భవిష్యత్‌లో ఉద్యోగం కూడా రాకుండా చేస్తా . ఈ ప్రచారం పూర్తికానీ  నీ అంతు తేలుస్తా’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  కాసేపటి తర్వాత పల్లె స్థానిక నాయకులతో కలసి తిరిగి ఆదినారాయణ ఇంటికి వచ్చి కూర్చున్నాడు.

ఆ సమయంలో యువకుడు ఇంటిలో లేకపోవడంతో ‘ఎంత సేపైనా వేచి చూస్తా వెళ్లి వాడిని వెతికి పట్టుకురండని’ పోలీసులను ఆదేశించాడు. పల్లెకు భయపడి తన స్నేహితుని ఇంటిలో దాక్కున్న ఆదిని పోలీసులు పట్టుకొని పల్లె వద్దకు తీసుకువచ్చారు. స్థానిక నాయకులు, పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఓ గదిలోకి తీసుకెళ్లి ఆది, వాళ్ల మామ ఆంజినేయులు ఇద్దరి చేత పల్లె రఘనాథరెడ్డి కాళ్లు పట్టించి సారీ చెప్పించారు. చివర్లో కూడా పల్లె మాట్లాడుతూ భవిష్యత్తులో ఎక్స్‌ట్రా చేశావంటే పుట్టగతులు లేకుండా చేస్తానని హెచ్చరించారు.

దీంతో బాధిత కుటుంబం ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. మనశ్శాంతి కరువై జీవిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం  ఆనోటా ఈ నోటా చేరి.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios