తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ నిట్ డైరెక్టర్ సీఎస్పీరావు విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని  మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి  ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు. నిట్ డైరెక్టర్‌పై రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పీహెచ్‌డీ పట్టా కోసం విద్యార్ధునుల నుండి నిట్ డైరెక్టర్‌ డబ్బులు కూడ డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆరోపించారు. విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని మాణిక్యాలరావు చెప్పారు.ఈ విషయమై హెచ్‌ఆర్‌డి మంత్రితో పాటు కేంద్ర హోంశాఖ సహయ మంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు.

also read:బీజేపీతో వైసీపీ జత కలిస్తే జనసేన కటీఫ్: తేల్చేసిన పవన్

గతంలో ఈ విషయమై మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిట్ డైరెక్టర్ స్వయంగా మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియోను కూడ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్టుగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

అయితే సోషల్ మీడియాలో నిట్ డైరెక్టర్ రావు వ్యవహరానికి సంబంధించి యూట్యూబ్‌లో పలు వీడియోలను అప్‌లోడ్ చేసిన విషయం కూడ పలువురు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.

ఈ విషయమై నిట్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తొలుత ఈ బాధ్యతల నుండి రావును తప్పించాలని ఆయన కోరారు. ఆ తర్వాత సీబీఐ విచారణ చేయించాలని ఆయన కోరారు.