భవిష్యత్తు కార్యాచరణ వాయిదా వేసిన కన్నా: ఎందుకో తెలుసా?
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
గుంటూరు: తన భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటనను వాయిదా వేసుకున్నట్టుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన అనుచరులతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం నాడు గుంటూరులోని తన నివాసంలో సమావవేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీకి రాజీనామా, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
అనుచరులతో సమావేశం ముగిసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితమే ఈ సమావేశం గురించి సమాచారం పంపినట్టుగా చెప్పారు. ఈ సమావేశంలో అన్ని విషయాలపై చర్చించినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సినీ నటుడు తారకరత్న మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తారకరత్న నటుడిగానే కాదు మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. తారకరత్న మృతి కారణంగా తన భవిష్యత్తు నిర్ణయాలను ప్రకటించడం వాయిదా వేసినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఈ నెల 16వ తేదీన బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై తీవ్ర అసంతృప్తిని కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. మీడియా వేదికగా కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ కూడా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో చర్చించారు. అయినా కూడా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అనుచరులతో సమావేశమై ఈ నెల 16న రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు
ఈ నెల 23వ తేదీన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు ముహుర్తం ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. అయితే తారకరత్న మృతి కారణంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం వాయిదా వేసుకున్నట్టుగా ఆయన వర్గీయులు చెబుతున్నారు.
also read:టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ :ఈ నెల 23న బాబు సమక్షంలో చేరిక
ఇదిలా ఉంటే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి ముందే క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు , తనపై కన్నా లక్ష్మీనారాయణ గతంలో విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడాన్ని రాయపాటి సాంబశివరావు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలతో కన్నా లక్ష్మీనారాయణ ఆలోచనలో పడ్డారా లేక తారకరత్న మృతితో ప్రకటనను వాయిదా వేసుకున్నారా అనే చర్చ సాగుతుంది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది.