టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ :ఈ నెల 23న బాబు సమక్షంలో చేరిక
బీజేపీకి ఇటీవలనే రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరనున్నారు.
గుంటూరు: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరనున్నారు. బీజేపీకి ఈ నెల 16వ తేదీన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి నచ్చక బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేయడానికి ముందే కొందరు టీడీపీ నాయకులతో కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగింది.
ఈ నెల 16వ తేదీన కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీకి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. అనుచరులతో సమావేశం ముగిసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుపై మీడియా వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి సోము వీర్రాజు వైఖరే కారణమని కూడా విమర్శలు చేశారు. జనసేనను బీజేపీ నాయకత్వం వైఖరితో జనసేన అసంతృప్తితో ఉందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. బీజేపీలో ఉంటే తనకు ఇబ్బందికర పరిస్థితులుండే అవకాశం ఉందని భావించి బీజేపీకి గుడ్ బై చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ.
also read:నన్ను, చంద్రబాబును తిట్టి టీడీపీలోకా.. వస్తే చెబుతా : కన్నాపై రాయపాటి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరే ముందు క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు తనపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలని రాయపాటి సాంబశివరావు కోరారు. గతంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్నా కూడా వీరిద్దరి మధ్య సఖ్యత లేదు. రాయపాటి సాంబశివరావు చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే ఈ కేసులో వీరిద్దరూ రాజీకి వచ్చారు.
నేడు అనుచరులతో కన్నా భేటీ
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో ఇవాళ నివాసం కానున్నారు.ఈ సమావేశంలో భవిష్యత్తు ప్రయాణం గురించి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులకు స్పష్టత ఇవ్వనున్నారు. ఈ సమావేశం తర్వాత టీడీపీలో చేరే విషయమై కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.