సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా విమర్శలు చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా సగం మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వందనం అందరికీ వర్తిస్తుందని అన్నారు. టీడీపీ సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అమ్మ ఒడిపై మాట తప్పారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలూ క్షీణించాయని అన్నారు.
గంటా శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. ఇందుకు విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతమే ఉదాహరణ అని పేర్కొన్నారు. అమ్మ ఒడిపైనా ఆయన విమర్శలు చేశారు. అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని అన్నారు. ఈ పథకం ద్వారా సగం మందికి మాత్రమే అమ్మ ఒడి డబ్బులు ఇవ్వడం దారుణం అని విమర్శించారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఉండదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నా వారందరికీ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా ఆ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
Also Read: Manipur Violence: మణిపూర్‌కు రాహుల్ గాంధీ.. అడ్డుకున్న పోలీసులు.. వెనుదిరిగిన కాన్వాయ్
టీడీపీ సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. టీడీపీ బస్సు యాత్రకు విశేష స్పందన వస్తున్నదని వివరించారు. చంద్రబాబుకు ఓటు వేసి సీఎం చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతారని జోస్యం చెప్పారు.
