అమరావతి: లారీలతో గుద్దించి చంపుతానని బెదిరించిన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు  మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. 

శుక్రవారం నాడు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.అసమర్ధత, అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు మంత్రి కొడాలి నాని చిల్లర, గల్లీ రాజకీయాలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.రాజకీయభిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్ తో పోతావ్ అంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రిపై దేవినేని ఫైరయ్యాడు.మంత్రి పదవిలో కొనసాగుతూ చంద్రబాబు వయస్సు గురించి, తమ చావుల గురించి మాట్లాడుతారా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. 

 చావు పుట్టుకుల గూర్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవి మన చేతుల్లో ఉండవని ఆయన గ్రహించాలి. బాధ్యత గల కేబినెట్ హోదాలో ఉండి టీడీపీ నాయకుల చావు గూర్చి దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీ ఫోన్ లకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. ఇకనైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు.

ఏదో ఒక కేసులో తనను  జైలుకు పంపాలని 15 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏ అవినీతి మరక దొరకపోయే సరికి.. చివరకు లారీలతో చంపాలని చూస్తున్నారని దేవినేని ఆరోపించారు.ఇక నుంచి టీడీపీ నాయకులకు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇనగవరపు అవినాష్ బాధ్యత వహించాలన్నారు. 

also read:నేను లారీ డ్రైవర్‌ని, నీవు సోడాలు అమ్మలేదా: దేవినేనిపై కొడాలి ఫైర్

నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు ఒక కేసులో తనకు సాయం చేసినందుకు ఒక టీడీపీ వ్యక్తికి సోషల్ మీడియాలో థ్యాంక్స్ అని చెబితే.. అతనిని పోలీసులతో కొట్టించారని ఆయన ఆరోపించారు. 

ఆత్మాభిమానం కలిగిన ఆ యువకుడు ప్రకాశం బ్యారేజీ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని అత్తగారు శానిటైజర్ తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఉమా చెప్పారు.