అమరావతి: నీవు ఎప్పుడు అధికారంలోకి వస్తావు... మాపై ఎప్పుడు కక్ష తీర్చుకొంటావని టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. 
తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు ఎన్టీఆర్ అని మంత్రి కొడాలి నాని గుర్తు చేసుకొన్నారు.

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. హుద్ హుద్ తుఫాన్ కి ఎదురెళ్లినవాడు కరోనాను చూసి ఎందుకు పారిపోతున్నాడని చంద్రబాబునాయుడుని ఆయన ప్రశ్నించారు.

దేవినేని ఉమ అంతరిక్షం నుండి వచ్చినవాడిలో ఉంటాడని ఆయన ఎద్దేవా చేశాడు.  తాను ఎప్పుడైనా బూతులు తిట్టానా అని నాని ప్రశ్నించారు. తాను బూతులు తిడితే చంద్రబాబు, దేవినేని ఉమా బతికి ఉంటారా అని నాని ప్రశ్నించారు.

ఉమా నువ్వేమైనా మైసూర్ మహారాజువా.. నీ తండ్రి ఏం చేశాడు... నీవు ఏం చేశావో తెలియదా అని ఆయన అన్నారు. తాను లారీ డ్రైవర్ అయితే నువ్వు సోడాలు అమ్మావని నాని మాజీ మంత్రి దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు.

లారీ డ్రైవర్, క్లీనర్ గురించి పదే పదే మాట్లాడుతున్నావని... కోపంతో ఎవరైనా లారీ డ్రైవర్ దేవినేని ఉమాపై లారీని ఎక్కించే అవకాశం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. లారీ కింద ఉమ అప్పడం అవుతాడని ఆయన చెప్పారు.

ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని ఆయన సూచించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెట్టిన కరెంట్ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించినట్టుగా మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు.చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 8 వేల కోట్లను తమ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు.

రైతుల కోసం 10 వేల మెగావాట్లతో పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడిని హింస్తున్నారని ఆరోపించడం సరైంది కాదని మంత్రి చెప్పారు.శస్త్రచికిత్స చేయించుకొన్న వారెవరైనా 70 రోజులు ఆసుపత్రిలో ఉంటారా అని ఆయన అచ్చెన్నాయుడు గురించి వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలను చంద్రబాబునాయుడు గాలికి వదిలేశారని చెప్పారు. నీవు ఎప్పుడు అధికారంలోకి వస్తావు.. మాపై కక్ష తీర్చుకొంటావని ఆయన ప్రశ్నించారు.