బాబుకు షాకిచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అమరావతి: పాదయాత్రతో వైసీపీ నిలదొక్కుకొందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. విపక్ష నేతగా జగన్ బాగానే పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 2014లోనే తాను రాజకీయాల నుండి తప్పుకొన్నట్టు ప్రకటించారు. పురంధరేశ్వరి బిజెపిలో ఉందని, తాను ఏ రాజకీయపార్టీలో కూడ లేనని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రతిపక్ష నేత జగన్ పనితీరు బాగానే ఉందన్నారు. పాదయాత్రకు జనసమీకరణ బాగానే ఉందన్నారు. పాదయాత్ర వైసీపీని నిలదొక్కుకొనేలా చేసిందన్నారు. 2014లోనే తాను క్రియాశీలక రాజకీయాలకు దూరమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పురంధరేశ్వరీ మాత్రం బిజెపిలో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత సమయంలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలంటే కనీసం రూ. 25 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు.
ఓట్లను కొనుగోలు చేసే సంస్కృతికి తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు తనకు ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు. మహానగర నిర్మాణం తప్పుకాదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కానీ, మూడు పంటలు పండే భూమిని ఎందుకు వినియోగించాల్సి వచ్చిందో ఆలోచించాలన్నారు.
మరోవైపు పర్యావరణం, వికేంద్రీకరణ అంశాలపై కూడ శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎన్ని ఎకరాల్లో ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఏపీకి నష్టమైతే పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరమని ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని బాబు చెప్పడం తాను నమ్మడం లేదన్నారు. నానాయాతన పడి పదవిలోకి వస్తే ఆ పదవిలో కూర్చోకుండా త్యాగం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టా బతికిందని దగ్గుబాటి చెప్పారు.
