విశాఖపట్టణం: ఈఎస్ఐ స్కాంలో ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం కి ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని నిరూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

మంత్రి జయరాం కొడుకు ఈశ్వర్ కు ఈఎస్ఐ స్కాంలో ఏ 14 నిందితుడు కార్తీక్ కారును ఇచ్చాడని  అయ్యన్నపాత్రుడు ఏసీబీ టోప్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.  మీడియా సమావేశంలోనే ఆయన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఈ విషయమై ఆధారాలను కూడ తాను పంపుతానని అయ్యన్నపాత్రుడు టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇచ్చాడు.  2019 డిసెంబర్ మాసంలో బెంజ్ కారును మంత్రి కొడుకుకు ఈ కారు గిఫ్ట్ గా అందించారని ఆయన ఆరోపించాడు. 

మంత్రి జయరామ్ ను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మంత్రి జయరాం అవినీతిపై   తాను సీఎం కార్యాలయానికి కూడ ఫిర్యాదు చేస్తామన్నారు.

ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అసలు సంబంధం లేదన్నారు.  ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయాలేదని ఆయన ప్రశ్నించారు. కారణం ఏమిటో తెలియడం లేదన్నారు.

మంత్రి కొడుకుకు ఏ 14 నిందితుడు కార్తీక్ గిఫ్ట్ అందిస్తున్న కారు ఫోటోను అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలో చూపారు. ఈ ఫోటోను కార్తీక్ తన ఫేస్‌బుక్ లో పోస్టు చేశాడని ఆయన చెప్పారు.