నెల్లూరు వైసీపీలో ఆసక్తికరం:కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ భేటీ
మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతల మధ్య విబేధాలు బహిరంగంగానే కన్పిస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్గతంగా నేతల మధ్య ఉన్న బేదాభిప్రాయాలు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణతో బయటపడ్డాయి. కొత్త మంత్రికి పొసగని ఎమ్మెల్యేలు సమావేశం కావడం చర్చకు దారి తీసింది.
నెల్లూరు: మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు జిల్లాలోని YCP లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. నేతల మధ్య ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నవిబేధాలు బహిరంగమయ్యాయి. నెల్లూరు జిల్లా నుండి kakani Govardhan Reddyకి మంత్రివర్గంలో జగన్ స్థానం కల్పించారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో ఆయన వైరి వర్గం అసంతృప్తితో ఉంది. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే kotamreddy Sridhar Reddy విలపించారు. కార్యకర్తలు శ్రీధర్ రెడ్డి ఓదార్చారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్నారు.ఈ సమయంలో గురువారం నాడు మాజీ మంత్రి Anil kumar Yadav కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు.
కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాలేదు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుండి ఆహ్వానం రానందునే తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ఎలా సహకరించారో అంతకు రెట్టింపు సహకరిస్తానని కూడా అనిల్ కుమార్ వ్యంగ్యంగా చెప్పారు.
గత టర్మ్ లో అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారుల సమావేశం ఏర్పాటు చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు పరోక్షంగా అనిల్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతో నెల్లూరు జిల్లాకు చెందిన నేతలను సీఎం YS Jagan పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని చెబుతున్నారు.
కాకాని గోవర్ధన్ రెడ్డికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య కూడా గ్యాప్ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. శతృవుకు శతృవు మిత్రుడు అనే చందంగా ఈ భేటీపై నెల్లూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చ సాగుతుంది. నిన్న మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ కావడం కూడా చర్చకు దారితీసింది.
మంత్రిగా ప్రమాణం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రమేయం ఉందని కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గం భావిస్తుంది. ఈ నెల 17వ తేదీన కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు. అదే రోజున అనిల్ కుమార్ కార్యకర్తలతో సమావేశం కానున్నారనే ప్రచారం సాగుతుంది.అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీ పరిణామాలపై రాష్ట్ర నాయకత్వం కూడా ఆరా తీస్తుంది.