ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ సందర్భంగా కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆమె రాజీనామాకు సిద్ధపడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో అధికార వైసీపీలో (ysrcp) అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అధినేత మొండిచేయి ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తుది జాబితా వెలువడిన క్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల మద్ధతుదారులు రోడ్లెక్కారు. చిలకలూరిపేట, మాచర్ల, ఒంగోలు, జగ్గయ్యపేట, పెనమలూరు వంటి చోట్ల వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మాజీ హోంమంత్రి, జగన్ (ys jagan) నమ్మినబంటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు (mekathoti sucharitha) జగన్ రెండోసారి అవకాశం ఇవ్వలేదు. అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించడం, తొలి నుంచి జగన్ వెంటే వుండటం, సామాజిక సమీకరణల నేపథ్యంలో సుచరితకు మళ్లీ ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ సీఎం ఆమెను పక్కనబెట్టక తప్పలేదు. ఆదివారం ప్రకటించిన కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో సుచరిత తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.
తన ఎస్సీ సామాజిక వర్గంలోని మిగతా మంత్రులందరినీ కొనసాగిస్తూ.. తనను మాత్రం పదవి నుంచి తప్పించడానికి తాను ఏం తప్పు చేశానని సుచరిత ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడానికి సుచరిత సిద్ధపడ్డట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో రెండు రోజులుగా తమ కుటుంబసభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోవడం లేదని ఆమె సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో తమకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ సుచరిత వాపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు సుచరితకు తాజా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆమె అభిమానులు, మద్ధతుదారులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని సుచరిత ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దళిత మహిళను అవమాన పరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 2019 శాసనసభ ఎన్నికల్లో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో ఏర్పాటు చేసిన జగన్ తొలి కేబినెట్‌లో మోపిదేవి వెంకటరమణ (mopidevi venkata ramana) , మేకతోటి సుచరితలకు అవకాశం కల్పించారు. అయితే, మోపిదేవిని రాజ్యసభకు పంపగా.. నాటి నుంచి నేటి వరకు జిల్లా నుంచి సుచరిత ఒక్కరే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజా పునర్వ్యస్ధీకరణలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి విడదల రజినీ (vidadala rajini) , అంబటి రాంబాబు (ambati rambabu), మేరుగ నాగార్జునలకు (merugu nagarjuna) జగన్ అవకాశం కల్పించారు. దీంతో సుచరిత సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (pinnelli ramakrishna reddy) , ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla ramakrishna reddy), మర్రి రాజశేఖర్ (marri rajasekhar) తదితర ఆశావహులకు నిరాశ ఎదురైంది. దీంతో వారి మద్ధతుదారులు రోడ్లెక్కి ఆందోళన నిర్వహిస్తున్నారు.
