విశాఖ: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు గురువారం నాడు జనసేన పార్టీలో చేరారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వేణుగోపాలరావు  జనసేనలో చేరారు.

భారత క్రికెట్ జట్టు తరపున వేణుగోపాలరావు 2005లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు.వేణుగోపాలరావు జనసేన పార్టీలో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ప్రజల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతోనే జనసేన పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల సమస్యలపై అధ్యయనం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.   

2019 ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పోరాటయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.