అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్ రెడ్డి  జూలై 13వ తేదీన ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు.  రేపు  రాహుల్ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీగా  ఉమెన్ చాందీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  2014 ఎన్నికలకు ముందు  కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయంలో భాగంగా కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఇతరులను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇందులో భాగంగానే జూలై13వ తేదీన కిరణ్‌కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన సమయంలోనే అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.  జైసమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు.  ఈ పార్టీ తరపునే అభ్యర్ధులను బరిలోకి దింపారు. అయితే జై సమైక్యాంధ్ర పార్టీకి ఆశించిన ఓట్లు, సీట్లు కూడ రాలేదు.

2014 ఎన్నికల తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి  క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఉమెన్ చాందీ  పిలుపు మేరకు  కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  కిరణ్‌కుమార్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కీలకమైన పదవిని ఆ పార్టీ నాయకత్వం కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.  అయితే కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరడం ఏపీ రాష్ట్రంలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహన్ని నింపుతోంది.

కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం  టీడీపీలోనే కొనసాగుతానని తన అనుచరులకు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా నుండి పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చనే ప్రచారం కూడ లేకపోలేదు.