పార్టీలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు: కన్నాతో బీజేపీ నేత విష్ణకుమార్ రాజు భేటీ
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజు ఇవాళ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు.
గుంటూరు: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సోమవారంనాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవన్నారు. బీజేపీలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. పార్టీ నేతలతో మాట్లాడే తీరిక అధిష్టానం పెద్దలకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో చోటు చేసుకున్న సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా విష్ణుకుమార్ రాజు వివరించారు. అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన తన మాటే పార్టీ అధిష్టానం వినే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తాను పార్టీ మారుతున్నానని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగానే కన్నా లక్ష్మీనారాయణను కలిసినట్టుగా విష్ణుకుమార్ రాజు చెప్పారు.
విష్ణకుమార్ రాజు పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది. అయితే తాను ఇంకా బీజేపీలోనే కొనసాగుతున్న విషయాన్ని విష్ణకుమార్ రాజు గుర్తు చేశారు. తాను పార్టీ మారుతానని కథనాలు ప్రసారం చేస్తూ తనకు ప్రచారం చేస్తు న్న మీడియాకు విష్ణకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు.బీజేపీ రాష్ట్ర శాఖకు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా పనిచేశారని విష్ణకుమార్ రాజు గుర్తు చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత వ్యక్తిగతంగానే కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమైనట్టుగా విష్ణుకుమార్ రాజు ప్రకటించారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో సమస్యలను చర్చించే సమయం పార్టీ అధినాయకత్వానికి లేదని విష్ణుకుమార్ రాజు నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో పార్టీలో చోటు చేసుకున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read:వేడెక్కిన రాజకీయం.. కన్నా అనుచరుడితో మంత్రి అంబటి రహస్య భేటీ, సత్తెనపల్లిలో ఏం జరుగుతోంది..?
ఈ నెల 16వ తేదీన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 23న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరే అవకాశం ఉంది.