నల్లమల అటవీ ప్రాంతంలో తల్లి పులి కోసం ఫారెస్ట్ అధికారుల గాలింపు కొనసాగుతుంది. అటవీ ప్రాంతంలో నాలుగు పులి పిల్లలు తల్లి పులి కోసం ఎదురు చూస్తున్నాయి.
నంద్యాల: ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఆపరేషన్ టైగర్ మదర్ కొనసాగుతుంది. బుధవారంనాడు రాత్రి నుండి గురువారం తెల్లవారు జాము వరకు తల్లి పులి కోసం సాగించిన ఆపరేషన్ సక్సెస్ కాలేదు.. దీంతో నాలుగు పులి పిల్లలను ఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు అధికారులు.
నల్లమల అటవీ ప్రాంతంలోని గుమ్మడాపురం గ్రామ సమీపంలోని ముళ్ల పొదల్లో నాలుగు పులి పిల్లలను స్థానికులు గుర్తించారు.ఈ పులి పిల్లల కోసం స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఈ నాలుగు పులి పిల్లలను అటవీశాఖాధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఎండ తీవ్రతకు పులి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు గాను అటవీశాఖాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా తల్లి పులి కోసం అటవీశాఖాధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఆపరేషన్ టైగర్ మదర్ టీ108 ను చేపట్టారు అధికారులు.
నల్లమల అడవిలో తల్లి పులి కోసం అటవీశాఖాధికారులు 50 ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అడవి ప్రాంతంలో పులి పాదముద్రల ఆధారంగా అటవీశాఖాధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా తల్లి పులి కోసం చేస్తున్న గాలింపు చర్యలు సఫలం కాలేదు. నాలుగు పులి పిల్లల ఆచూకీ కోసం తల్లి పులి కూడా వెతికే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. తన పిల్లల ఆచూకీ తెలియక తల్లి పులి తీవ్రమైన ఆగ్రహంతో ఉండే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నల్లమల శివారు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తల్లి పులి దృశ్యాలు ఓ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా అటవీశాఖాధికారులు మదర్ టైగర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి నుండి ఇవాళ ఉదయం 6 గంటల వరకు తల్లి పులి కోసం అటవీశాఖాధికారులు గాలించారు. కానీ పులి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో నాలుగు పులి పిల్లలను ఆత్మకూరు డీఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు అటవీశాఖాధికారులు.
