విజయవాడ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో మరో రెండు రోజుల్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుండి కూడ భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందిన అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్, పులిచింతలతో పాటు వర్షాలతో వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తే ప్రమాదం లేకపోలేదు.

భారీగా వరద నీరు వస్తే విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల తహసీల్దార్లు, రెవెన్యూ  ఇరిగేషన్ అధికారులకు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్  దిశానిర్దేశం చేశారు..

ఎటువంటి ప్రాణ ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. విజయవాడ లోని రాణిగారి తోట ,తారకరామ నగర్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

నగరంలోని ఇందిరా గాంధి మునిసిపల్ స్టేడియం లో పునరావాస కేంద్రాన్ని మునిసిపల్ అధికారులు ఏర్పాటు చేశారు.. తీర ప్రాంత ప్రజలను ముందే ఖాళీ  చేయించాలని  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..