ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.9 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఈ క్రమంలో దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. డెల్టా కాల్వకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. సముద్రంలోకి 13.19 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

దేవీ పట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇప్పటి వరకు 800 ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. గానుగులదొందు, పూడిపల్లి, పోచమ్మగండి గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది.

అలాగే వరద కారణంగా 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.2 అడుగులకు చేరడంతో అధికారులు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.