ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్, చంద్రబాబుల మధ్య పోరులో ఎక్కువగా వినిపించిన మాట రిటర్న్‌గిఫ్ట్.. తెలంగాణలో ఎన్నికల్లో తనను ఓడించడానికి కాంగ్రెస్ సహా ఇతర పక్షాలతో చేతులు కలిపిన బాబుపై కేసీఆర్ అంతెత్తున లేచారు. 

ఎన్నికల ప్రచారంలో ఆంధ్రోడి చేతుల్లో తెలంగాణను మళ్లీ పెడదామా అంటూ సెంటిమెంట్‌ను రగిల్చి గులాబీ చీఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటి దాకా మౌనాన్ని పాటించినప్పటికీ ఫలితాల రోజున సాయంత్రం ప్రెస్‌మీట్‌లో బాబుపై విరుచుకుపడ్డారు. 

ఏపీ ఎన్నికల్లో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాంతో అది ఎలా ఉండబోతోంది.... ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు, ఏపీలో వైసీపీ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తారా, లేక ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా వంటి ప్రశ్నలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

అయితే కేసీఆర్ మార్క్ వ్యూహాం వేరుగా వుంది. తాను ఎక్కడ నోరు జారీనా అది బాబుకు ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన సైలంటయ్యారు. 
తీరా ఎన్నికల జరగడం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అందుకోవడం చకచకా జరిగింది. 

జగన్ విజయంలో కేసీఆర్ సైతం తెర వెనుక సాయం చేశారన్నది విశ్లేషకుల మాట. ఎలా చేస్తే ఏముంది ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. బాబు చిత్తు చిత్తుగా ఓడిపోయారు.. ఏకంగా ఏపీలో పార్టీ పునాదులే కదిలిపోయేంత బలమైన గిఫ్టు ఇచ్చారని వైసీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

గురువారం జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ అధినేత రాక సందర్భంగా బెజవాడలో వైసీపీ శ్రేణులు జగన్, కేసీఆర్‌ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. అందులో రిటర్న్ గిఫ్ట్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.