నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: నవదంపతులు సహా ఐదుగురు మృతి
నంద్యాల జిల్లాలో ఇవాళ ఉదయం విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
కర్నూల్: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద బుధవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన రవీందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రవీందర్, ఆయన భార్య లక్ష్మీ, కొడుకు, బాలకిరణ్, కోడలు కావ్య, రవీందర్ మరో కొడుకు ఉదయ్ కిరణ్ మృతి చెందారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29న రవీందర్ కొడుకు బాలకిరణ్‌కు కావ్యకు వివాహం జరిగింది. ఈ నెల 4న తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు రవీందర్ తన కుటుంబసభ్యులతో కారులో బయలు దేరారు.తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
also read:పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: జాబితా రెడీ, రాహుల్ పోటీపై రాని స్పష్టత
అతి వేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన సూచికలను గమనించకుండా వాహనాలు నడపడం కూడ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేగాన్ని కంట్రోల్ చేయని కారణంగా కూడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వాహనాలు నడిపేవారితో పాటు ప్రయాణీకులు కూడ కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ప్రాణనష్టాన్ని కొంతలో కొంతైనా తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
also read:విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
ఈ నెల 4న తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బెంగుళూరు నుండి హైద్రాబాద్ వస్తున్న కారు కొత్తకోట జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
also read:టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా
ఈ ఏడాది ఫిబ్రవరి 29న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.అతి వేగంగా వస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ వాహనంలో ప్రయాణీస్తున్నవారిలో 14 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 23న తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.