ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐదు జిల్లాల్లోనే సుమారు 7 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 1,885, గుంటూరు 1593, అనంతపురం 1201, కర్నూలు 1180, శ్రీకాకుళం 1052 కేసులు రికార్డయ్యాయి.

గుంటూరు జిల్లాలో కోవిడ్ విజృంభణతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.

25 రోజుల్లోనే 17 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా వుందో అర్ధమవుతోంది. మరోవైపు కరోనా పేషెంట్లకు వైద్యం అందక, బెడ్లు దొరక్క, రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లు లభించక మృత్యువాత పడుతున్నారు.

Also Read:కష్టపడి ఆసుపత్రికొస్తే.. మెట్లపైనే కుప్పకూలిన మహిళ: విశాఖలో హృదయ విదారక ఘటన

ఫిబ్రవరి వారం మొదటి వారంలో కొంత తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే సెకండ్ వేవ్ ప్రభావం పెద్దగా వుండదని భావించారు.  కానీ తర్వాత పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. జనవరి నెలలో 747 కరోనా పాజిటివ్ కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదవ్వగా.. ఫిబ్రవరికి వచ్చే సరికి కేవలం 229 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

దీంతో ఇక సెకండ్ వేవ్ లేదని అధికారులు భావించారు. కానీ మార్చి నెలలో పరిస్ధితి మారిపోయింది. 229గా వున్న కేసుల సంఖ్య 2219కి చేరుకున్నాయి. అయితే ఏప్రిల్ నెల నాటికి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ విజృంభిస్తోంది.