ఏపిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మింగేసిన కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గల ఓ కుటుంబంలో కరోనా వైరస్ తీవ్రమైన విషాదాన్ని మిగిలించింది. తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా వైరస్ విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. రెండు వారాల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయి. కుటుంబంలోని మూడు తరాలవాళ్లు మృత్యువాత పడ్డారు.
కుటుంబంలోని 16 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో వాళ్లంతా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. అయితే, రెండు వారాల వ్యవధిలో వారిలో ఐదుగురు మరణించారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంో చినకాకానిలో గల ఎన్నారై ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం మూడో అంతస్థు పైనుంచి దూకి అతను మరణించాడు.
గుంటూరులోని మారుతీనగర్ కు చెందిన నాగమురళి (66) కరోనా సోకడంతో ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మూడో అంతస్థు నుంచి దూకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య సిబ్బంది ఎమర్జెన్సీ కేర్ యూనిట్ కు తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతను మృత్యువాత పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.