అమరావతి:ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి తొలి రోజు విచారణ పూర్తైందని ఏసీబీ ప్రకటించింది.

గురువారం నాడు సాయంత్రం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఉన్న  అచ్చెన్నాయుడిని తమ కస్టడీలోకి తీసుకొన్నారు.కోర్టు జారీ చేసిన పత్రాలను ఆసుపత్రి సూపరింటెండ్ కు ఏసీబీ అధికారులు చూపారు. తర్వాత ఆయనను విచారించారు.

మూడు గంటలకు పైగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఈఎస్ఐ స్కాం గురించి విచారించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యంగానే ఉన్నాడని ఏసీబీ అధికారులు చెప్పారు.

also read:గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అచ్చెన్నను విచారిస్తున్న ఏసీబీ

మరో రెండు రోజుల పాటు ఆయనను విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మూడు రోజుల పాటు ఈఎస్ఐ స్కాంలో విచారణ కోసం అచ్చెన్నాయుడు సహా మిగిలినవారిని ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తోంది.

ఈ నెల 12వ తేదీన ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిమ్మాడలోని తన నివాసంలో ఉన్న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడానికి ముందు రోజే శస్త్రచికిత్స అయిన విషయాన్ని తాము చెప్పినా కూడ పట్టించుకోకుండా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా ఆ సమయంలో కుటుంబసభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే.