గుంటూరు:  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత  అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గురువారం నాడు జీజీహెచ్ ఆసుపత్రిలో తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఈఎస్ఐ స్కాంలో  మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈ నెల 12వ తేదీన అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడిని అదే రోజు రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. 

ఈ కేసులో నిందితులను ఏసీబీ అధికారులు తమ కస్టడీని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆయన తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే అచ్చెన్నాయుడిని న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. అయితే బుధవారం నాడు రాత్రి ఆసుపత్రి నుండి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసేందుకు పోలీసులు హైడ్రామా చేశారని ప్రచారం సాగింది. 

అయితే ఇవాళ సాయంత్రం జీజీహెచ్ ఆసుపత్రికి వచ్చిన ఏసీబీ అధికారులు కోర్టు ఉత్తర్వులను జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండ్ కు అందించారు. కస్టడీకి తీసుకొని అచ్చెన్నాయుడును ఏసీబీ విచారిస్తోంది.