బుద్ధా వెంకన్న హడావుడి.. నేనూ వున్నానంటూ జలీల్ ఖాన్, పోతిన మహేష్ అలక.. హాట్ హాట్‌గాబెజవాడ ‘‘ వెస్ట్ ’’
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంను తొలి నుంచి జనసేన ఆశిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సైతం తనకు పశ్చిమ సీటు కావాలని పట్టుబడుతున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ .. నేను కూడా రెడీ అంటూ రంగంలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్లు దక్కని నేతలంతా ఇతర పార్టీల్లో చేరి అటు నుంచి నరుక్కొస్తున్నారు. ఎలాగైనా టికెట్ సాధించడమే తమ అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోవైపు.. టీడీపీ-జనసేన పొత్తు ఆల్రెడీ ఖరారైపోగా.. సీట్ల పంపకాల్లో తమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నట్లుగా ఇరు పార్టీల కేడర్ వ్యవహరిస్తోంది. తమను సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించడంపై నొచ్చుకున్న పవన్ కళ్యాణ్.. తను కూడా అభ్యర్ధులను ప్రకటించి షాకిచ్చారు.
అయితే పొత్తులో భాగంగా ఎక్కడ తమకు సీటు గల్లంతవుతుందేమోనని ఇరు పార్టీల నేతలు భయపడుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్‌ను తొలి నుంచి జనసేన ఆశిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సైతం తనకు పశ్చిమ సీటు కావాలని పట్టుబడుతున్నారు. ఇవాళ ఏకంగా బలప్రదర్శన నిర్వహించారు. దుర్గ గుడి వరకు ర్యాలీగా వెళ్లిన ఆయన.. టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా వెంకన్న తెలిపారు.
చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని.. అలాగే టికెట్ రాలేదని ఆయను విమర్శిస్తే తాట తీస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలను జనసేన నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పోటీ చేయాలని భావిస్తున్నారు. బుద్దా వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఆయన వున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతలో మరో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ .. నేను కూడా రెడీ అంటూ రంగంలోకి దిగారు. తనకు వెస్ట్ టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వకుంటే ఉరి వేసుకుంటారో, ఏం చేసుకుంటారో కూడా తెలియదని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా వున్నాయని , ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని బాంబు పేల్చారు. బుద్ధా వెంకన్న హడావుడి, జలీల్ ఖాన్ అల్టీమేటానికి తోడు పోతిన మహేష్ అలకతో విజయవాడ వెస్ట్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మరి ఈ ఇష్యూను ఇరు పార్టీల అధినేత ఎలా డీల్ చేస్తారో చూడాలి.