జీపీఎస్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేదని.. సీపీఎస్ పోరాట సంఘాలు తేల్చిచెబుతున్నాయి. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించకుంటే ఛలో విజయవాడకు సిద్ధమని వారు హెచ్చరించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానంపై కొన్ని ఉద్యోగ సంఘాలు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీపీఎస్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేదని.. సీపీఎస్ పోరాట సంఘాలు తేల్చిచెబుతున్నాయి. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తక్షణం అమలు చేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

జీపీఎస్‌ను స్వాగతించిన జేఏసీ నేతలపైనా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. జేఏసీ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సంబంధించి ఏపీ సీపీఎస్ఈఏ గౌరవ కార్యదర్శి బాజీ పఠాన్ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 19, 26 తేదీల్లో స్పందనపై రెఫరెండం నిర్వహిస్తామని, జూలై 8న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా జేఏసీ నేతలకే జేపీఎస్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

Also Read: ఓపీఎస్‌కు దగ్గరగానే జీపీఎస్, సమస్యలు పరిష్కరించినందుకు జగన్‌కు ధన్యవాదాలు : బొప్పరాజు

ఏళ్లుగా సేవలు చేస్తున్నా రెగ్యులరైజేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేవలం 6,667 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేయడం అన్యాయమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని .. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించకుంటే ఛలో విజయవాడకు సిద్ధమని వారు హెచ్చరించారు.