Asianet News TeluguAsianet News Telugu

సిఆర్డీఏకి వ్యతిరేకంగా డప్పేసిన రైతులు

  • భూసేకరణ అభ్యంతరాలపై అధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించాలని రైతులు నిర్ణయించారు.
  • అదే విషయాన్ని గ్రామంలో దండోరా వేయించి మరీ ప్రటకటన చేయించారు.
  • ఇకపై సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసే ఏ సమావేశానికి కూడా హాజరుకాకూడదని డప్పు వేయించారు. 
  • గతంలో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటు 13 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసిందగ్గర నుండి రైతులు ప్రభుత్వమంటేనే మండిపోతున్నారు.
Farmers of penumaka decides to boycott crda meeting

సీఆర్డీఏ అధికారులకు గురువారం పెద్ద షాక్ తగిలింది. భూసేకరణ అభ్యంతరాలపై సిఆర్డిఏ అధికారుల ముందు రైతులెవరూ హాజరు కావద్దంటూ పెనుమాక గ్రామంలో దండోరా వేసారు. రాజధాని నిర్మాణం కోసం రైతులనుండి ప్రభుత్వం భూములు సమీకరిస్తున్న విషయం తెలిసిందే కదా? అయితే, కొన్ని గ్రామాల రైతులు తమ భూములను ఇవ్వటానికి అంగీకరించలేదు. దాంతో సిఆర్డీఏ అధికారులు పలుమార్లు రైతులతో సమావేశమై కౌన్సిలింగ్ చేయాలనుకుంటున్నారు.

ఇందులో భాగంగానే అధికారులు పలు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే, చాలా గ్రామాల్లో రైతులకు, ఆధికారులకు వివాదాలు రేగుతున్నాయి. ఎందుకంటే, సమావేశంలోని వివరాలను మినిట్స్ బుక్ లో నమోదు చేసి తమకు కాపీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. అందుకనే అధికారులు ఎక్కడికెళితే అక్కడ రైతులతో ఘర్షణలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే గురువారం అధికారులు పెనుమాక గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసారు. రాజధానికి భూములు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పెనుమాక కీలకం. అందుకే భూసేకరణపై అధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించాలని రైతులు నిర్ణయించారు. అదే విషయాన్ని గ్రామంలో దండోరా వేయించి మరీ ప్రటకటన చేయించారు. ఇకపై సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసే ఏ సమావేశానికి కూడా హాజరుకాకూడదని డప్పు వేయించారు.

రెండేళ్లలో చాలాసార్లు అభ్యంతరాలు ఇచ్చామని, అధికారులు ఏ ఒక్కటీ పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైగా సమావేశాలకు పిలిచి అక్రమ కేసులు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బహిరంగ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించి గతంలో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటు 13 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసిందగ్గర నుండి రైతులు ప్రభుత్వమంటేనే మండిపోతున్నారు. రైతుల తాజా నిర్ణయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios