వేరే కులం వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో ఒప్పుకోరని  తెలిసి ప్రియుడితో కలిసి రెండు సార్లు పారిపోయింది. ఎలాగోలా రెండు సార్లు కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయినా.. ఆమె తీరు మారలేదు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాలని పట్టుబట్టింది. అయితే.. ఆమె కారణంగా.. ఎక్కడ తమ పరువు పోతుందోనని.. కూతురిని కన్న తల్లిదండ్రులు హత్య చేశారు. ఈ దారుణ సంఘటన అనంతపురంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట చెక్‌ పోస్ట్‌ దగ్గర నివాసముంటున్న రామాంజినమ్మ కుమార్తె సంధ్య(17), హిందూపురానికి చెందిన శేఖర్‌ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ రెండు సార్లు ఇల్లు వదలి వెళ్లిపోగా తల్లి చేసిన ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు హైదరాబాదులో ఉన్న వీళ్లిద్దరినీ తెచ్చి అప్పగించారు. 

యువతి వల్ల తమ కుటుంబం ఇబ్బందులకు గురవుతోందని భావించిన తల్లి రామాంజినమ్మ, అన్న అశోక్, అక్క నేత్రావతి, ఆమె భర్త బాలకృష్ణ అందరూ కలిసి సంధ్యను అంతమొందించాలని పథకం రచించి హత్య చేశారు. 

మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేశారు. తరువాత తమ కుమార్తె కనిపించడం లేదని హిందూపురం పోలీస్‌ స్టేషనులో కేసు పెట్టారు. గౌరిబిదనూరు రూరల్‌ పోలీసులకు సమాచారం రాగా, చెరువులో దొరికిన యువతి ఆనవాళ్లతో సరిచూసి కేసును ఛేదించారు. సీఐ రవి, ఎస్‌ఐ మోహన్‌లు కేసు విచారించారు.