ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసింది ఓ కుటుంబం.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురానికి చెందిన కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఏడాది క్రితం వెలివేశారు గ్రామస్తులు. గ్రామానికి చెందిన మూడున్నర ఎకరాల భూమి తన పేరు మీద రాయించుకున్నాడని ఏడాది క్రితం వూరి నుంచి వెలివేశారు మత్స్యకారులు.

దీనిపై అప్పట్లో వెంకటేశ్వర్లు మనవరాలు.. నాలుగో తరగతి చదువుతున్న పుష్ప ముఖ్యమంత్రి జగన్‌కి లేఖ రాసింది. చిన్నారి లేఖపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన సీఎం.. విచారణ జరపాల్సిందిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను ఆదేశించారు.

కాగా, కలెక్టర్ ఆదేశాల మేరకు రామచంద్రాపురంలో జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి అందరూ కలిసి ఉండాలని గ్రామస్థులకు సూచించారు. కానీ తర్వాత కూడా గ్రామస్తుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామస్తులు వూళ్లోకి రానివ్వలేదు. దీంతో గతేడాది ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిని అడ్డుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కానీ ఇంత వరకు సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలంటూ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు వెంకటేశ్వర్లు.