రోడ్డు ప్రమాదంలో మరణించిన బంధువుని కడసారి చూసేందుకు వచ్చి.. వీరు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అంత్యక్రియలకు హాజరై వెళుతుంగా రోడ్డు ప్రమాదానికి గురై.. ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేష్‌బాబు (19) శుక్రవారం చిత్తూరు – కడప జాతీయ రహదారిలో స్కూటర్‌పై వస్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతి చెందాడు. 

మహేష్‌బాబు మృతదేహం పీలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉండటంతో కడచూపు చూడడానికి అతని తాత కొత్తగాండ్లపల్లెకు చెందిన ఆర్‌.వెంకటరమణ (65), ఆయన పెద్ద భార్య పార్వతమ్మ (60), చిన్నభార్య సుజాతమ్మ (58), కుమార్తె రెడ్డి గోవర్ధని (21), బంధువులైన ఆటో డ్రైవర్‌ దామోదర్‌ (35), కేవీపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన నీలావతి (34), ఆమె కుమార్తె పుష్పావతి (18) ఆటోలో పీలేరుకు వచ్చారు.
 
 మృతదేహాన్ని చూసి, తిరిగి శుక్రవారం రాత్రి ఆటోలో కొత్తగాండ్లపల్లెకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన ఐచర్‌ వాహనం వీరి ఆటోను ఢీకొంది. 
వెంకటరమణ, పార్వతమ్మ, సుజాతమ్మ, రెడ్డిగోవర్ధని అక్కడికక్కడే మృతి చెందారు. దామోదర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నీలావతి, పుష్పావతి చికిత్స పొందుతున్నారు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.