ఇన్సూరెన్స్ డబ్బుల కోసం శవాన్ని తెచ్చి డ్రామా.. భార్య ఏడుపు తట్టుకోలేక ఫోన్ చేయడంతో వెలుగులోకి అసలు కథ
తూర్పు గోదావరి జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి స్మశానంలో నుంచి పూడ్చిపెట్టిన శవాన్ని తీసుకువచ్చి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. భార్య పెడబొబ్బలు పెడుతూ ఏడవడంతో ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
Insurance: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అప్పులు తీర్చడానికి పెద్ద స్కెచ్చే వేశాడు. రెండు నెలల క్రితం ఇన్సూరెన్స్ చేయించుకుని తాను చనిపోయినట్టు ఓ డ్రామా చేశాడు. ఇందుకోసం ఏకంగా స్మశానంలో పూడ్చిపెట్టిన ఓ శవాన్ని కూడా తెచ్చి.. అది తనదే అన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. అది నిజమేనని నమ్మి సదరు వ్యక్తి భార్య లబోదిబోమని ఏడ్చింది. భార్య ఏడుపు తట్టుకోలేక ఆయనే ఓ ఫోన్‌లో నుంచి కాల్ చేసి తాను బతికే ఉన్నానని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు కూపీ లాగడంతో వీరి స్కెచ్ తాలూకు వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బులు అడ్డదారిలో పొందాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైంది కేతమల్లు వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య.
జనవరి 26వ తేదీన తెల్లవారుజామున వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమల్లు గంగారావు పొలం దగ్గర ఓ శవం సగం కాలిపోయి కనిపించింది. అక్కడ లభించిన చెప్పులు, సెల్‌ఫోన్లతో ఆ డెడ్ బాడీ పూసయ్యదేనని అందరూ అనుకున్నారు. అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు.
కుటుంబ సభ్యులు పూసయ్యకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. భార్య, బిడ్డలు గుండెలు అదిరేలా విలపిస్తున్నారు. ఆ సమయంలోనే భార్యకు పూసయ్య ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరినో చంపుతూ ఉంటే తాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే దుండగులు తనపై దాడి చేసి రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి వద్ద వదిలిపెట్టి పారిపోయారని చెప్పాడు.
Also Read: Israel: మన దేశం నుంచి ఇజ్రాయెల్‌కు 10 వేల మంది వర్కర్లు.. వచ్చే వారం నుంచి ప్రయాణం
ఈ ఘటనలో ట్విస్ట్ మరో మలుపు తిరిగింది. దాడికి గురైనా పూసయ్యపై ఒక్క దెబ్బ ఆనవాళ్లూ లేవు. ఆయన చెప్పే విషయాలకు పొంతన లేకపోవడం, మరి ఈ డెడ్ బాడీ ఎవరిది? వంటి వివరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. పూసయ్యనే విచారించగా చివరకు అసలు విషయం చెప్పాడు.
పూసయ్య రెండు నెలల క్రితమే సహజంగా మరణిస్తే రూ. 20 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 40 లక్షలు తన కుటుంబానికి వచ్చేలా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. తాను మరణించినట్టు నమ్మించి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉంటే వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఉండొచ్చని అనుకున్నాడు.
బొమ్మూరుకు చెందిన ఓఎన్జీసీ ఇంజినీర్ నెల్లి విజయరాజు మరణించడంతో పాతబొమ్మూరు స్మశానంలో పూడ్చి పెట్టారు. పూసయ్యతో డీల్ సెట్ చేసుకున్న బొమ్మూరుకు చెందిన వందె శ్రీను, చీర చిన్ని అనే యువకులు 25న ఆ డెడ్ బాడీ దొంగిలించారు. 26వ తేదీ తెల్లవారుజామున పెట్రోల్ పోసి తగులబెట్టి వీరంపాలెం పొలంలో పడేశారు. పూసయ్య చెప్పులు, సెల్‌ఫోన్ అక్కడ వేసి పారిపోయారు.
Also Read: చకినాల ముక్క గొంతులో ఇరుక్కుని మంచిర్యాల వాసి మృతి
బీమా డబ్బుల కోసం చనిపోయినట్టు నాటకం ఆడటమే కాకుండా, పూడ్చిపెట్టిన శవాన్ని దొంగిలించడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 30న పోలీసులు పూసయ్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.