విశాఖపట్నం: స్టైల్ కోసం జుట్టును పెంచుకునే యువకులను బెదిరిస్తూ రాక్షసానందం పొందుతున్న ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను పోలీస్ అధికారినంటూ, మాట వినకుంటే కేసు పెట్టి జైళ్లో పెడతానని బెదిరింపులకు పాల్పడటంతో స్థానిక యువతను భయాందోళనకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ నకిలీ పోలీస్ గుట్టు బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మచ్కూరి పండరి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖలో నివాసముంటున్నాడు. అయితే అతడికి మగవాళ్లు జుట్టు పెంచుకోవడమంటే ఇష్టపడేవాడు కాదు. దీంతో సోషల్ మీడియాలో జులపాలతో ఎవరు కనిపించినా వారి ఫోన్ నంబర్లు సేకరించి పోలీస్ నంటూ బెదిరించేవాడు. జట్టు కత్తిరించుకోవాలని... లేదంటే కేసు పెడతానంటూ బెదిరించేవాడు. 

ఇటీవల అనకాపల్లి భీమునిగుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తికి ఇలాగే పోలీస్ నంటూ ఫోన్ చేసి జుట్టు కత్తిరించుకోవాలని బెదిరించాడు. దీంతో మణికుమార్ తన జుట్టును కత్తిరించుకున్నాడు.అయితే అంతటితో ఆగకుండా గుండు చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన మణికుమార్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఫోన్ నెంబర్ ఆదారంగా పండరి ఆచూకీని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే నిందితుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు యువకులను బెదిరించి జుట్టు కత్తిరించుకునేలా చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పోలీసులమంటూ ఫేక్ కాల్ చేస్తే ఎవరూ భయపడవద్దని తెలిపారు.