మంత్రివర్గానికి ముహూర్తం ఎన్నడు? దసరా వెళ్ళిపోయి  చాలా కాలమైంది దీపావళి కూడా వచ్చింది, వెళ్లపోయింది చంద్రబాబుకు ముహూర్తమే కుదరలేదా?  

దసరా అయిపోయింది..దీపావళి కూడా వెళ్లిపోయింది..చంద్రబాబునాయడుకు మాత్రం ముహూర్తం కుదరలేదా అంటూ తమ్ముళ్ళు సణుగుతున్నారు. ఇదంతా ఎందుకంటారా? అదేనండి మంత్రివర్గంలో చోటు కోసం. గడచిన శాసనసభ సమావేశాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫీలర్లు వచ్చాయి. అయితే, అవన్నీ ఉత్తవేనని తేలిపోయింది. అయితే, ఒక టివి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా మంత్రివర్గంలో మార్పులుంటాయని స్వయంగా చెప్పారు.

దాంతో మంత్రిపదవులను ఆశిస్తున్న వారందరూ ఊహల పల్లకిలో ఊగటం మొదలుపెట్టారు. బెర్త్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవటంలో భాగంగా చిన్నబాబును ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కుడా కట్టారు. అఫ్ కోర్స్ ఇపుడు కూడా అదే చేస్తున్నారనుకోండి. అయితే, దసరా పండుగ వచ్చింది..వెళ్ళిపోయింది. మంత్రివర్గం ఊసు మాత్రం లేదు. దాంతో నిరాస పడిపోయారు. ఇంతలో దీపావళి కూడా వచ్చి వెళ్ళిపోవటంతో తమ్ముళ్ళలో అసంతృప్తి మొదలైంది.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళయింది. ఎప్పటికప్పుడు మంత్రివర్గంలో మార్పులుంటాయని చెప్పుకోవటమే గానీ వాస్తవమేమిటన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఏ విషయంలోనైనా సరే ప్రతీ ఒక్కరినీ చివరి నిముషం వరకూ కన్ఫ్యూజన్లో ఉంచటమే చంద్రబాబు ప్రత్యేకతగా తమ్ముళ్ళు చెప్పుకుంటూంటారు. అటువంటిది మంత్రివర్గం లాంటి కీలకమైన అంశంలో చంద్రబాబు ఎందుకు ముందస్తు సంకేతాలు పంపుతారనేది తాజాగా టిడిపిలో వినిపిస్తున్న మాట.

మంత్రివర్గంలో మార్పులపై చంద్రబాబు ముందస్తు సంకేతాలు పంపటం కూడా వ్యూహాత్మకమేనని నేతలు ఇపుడు అనుమానిస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి వైసీపీని మరింత బలహీన పరిచేందుకు, ఇప్పటికే టిడిపిలో చేరిన ఫిరాయింపు శాసనసభ్యులు బుసకొట్టకుండా ఉండేందుకు, ఇటు మంత్రివర్గంలోనూ అటు పార్టీలోనూ తన పట్టు చెదరగొట్టకుండా చూసుకునేందుకు, చిన్నబాబు వద్దకు ప్రజాప్రతినిధులు బారులు తీరేందుకు ఇలా అనేక ప్రయోజనాలను ఆశించే చంద్రబాబు కావాలనే ఫీలర్లు వదిలి వుంటారని పలువురు అనుమానిస్తున్నారు.

అయితే, ఒకదశలొ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేద్దామని చంద్రబాబు అనుకున్న మాట వాస్తవమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా మంత్రివర్గం నుండి ఎవరినీ తీసేట్లు లేదన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించారని అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అసమర్ధులుగా ముద్రపడిన వారు, వయస్సు పైన బడిన వారు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు మంత్రివర్గంలో ఉన్నా వారెవరినీ తొలగించే సాహసం చేయలేకే రెండున్నరేళ్ళుగా కొనసాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

మంత్రివర్గం నుండి ఎవరినీ తొలగించకుండానే అదనంగా మరో 7 మందిని చేర్చుకునే అవకాశాలున్న విషయం చంద్రబాబుకు తెలియందు కాదుకానీ వివిధ కారణాల రీత్యా మంత్రివర్గంలో మార్పులకు ముహూర్తం మాత్రం కుదరటం లేదు. బహుశా లోకేష్ విషయంలో స్పష్టత వస్తే కానీ ముహూర్తం కుదరదేమోనని నేతలు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు.