కడప: మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గురువారం ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సాయిప్రతాప్ కు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రఘువీరారెడ్డి. 

సాయిప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలుగొందారు. ఆయన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన ముందు వరకు ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 

2009లో రాజంపేట ఎంపీగా గెలిచిన సాయిప్రతాప్ కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2011న కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. అయితే 2016లో ఎవరూ ఊహించనట్లుగా టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 

అయితే మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభకు అవకాశం ఇవ్వడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.  మార్చి 30న టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆనాటి నుంచి సైలెంట్ గా ఉన్న సాయిప్రతాప్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.