కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో కిశోర్... ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు.

ఆయనతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు కూడా టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కిశోర్ చంద్రదేవ్.. కురుపాం రాజవంశీయుడు. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009లో యూపీఏ-2 హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో ఆయన కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.