ఉత్తరాంధ్రలో కీలకనేతగా ఉన్న టీడీపీ మాజీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు. ఈ నెల 28న రమేశ్ వైసీపీలో చేరనున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పంచకర్ల రమేశ్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచిన రమేశ్ బాబు.. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పంచకర్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోఈ ఏడాది మార్చిలో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.